తిరువూరు నియోజకవర్గం, విసన్నపేట లో జరిగిన సంఘటన కుటుంబ సభ్యులని అయోమయంలో పడేసింది. వివరాల్లోకి వెళ్ళితే... విసన్నపేట గ్రామానికి చెందిన నందిపాం సురేష్ భార్య తులసి (22) తనకున్న పూరిల్లు సర్దుకునే సమయంలో తెలియని పురుగు కుట్టిందని అనుమానంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తర్వాత నూజివీడు డాక్టర్లు పరిశీలించి ఇన్ఫెక్షన్ సోకిందని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. అక్కడ డాక్టర్లు చేతికి ఉన్న ఇన్ఫెక్షన్ తొలగించి కట్టు (డ్రెస్సింగ్) కడుతూ అందులో సర్జరీ కోసం ఉపయోగించే బ్లేడు మరిచిపోయి కట్టు వేశారు. దీంతో చేయికి పూర్తిగా ఇన్ఫెక్షన్ పాకింది. దీంతో డాక్టర్లు చేయి తీసేయాలని అనటంతో ఆమె పరిస్థితి అయోమయంగా మారిపోయింది. చిన్న గాయంతో ఆసుపత్రికి వస్తే పూర్తిగా తన చేతినే తొలగిస్తామని చెప్పడంతో తులసి, ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబం. భార్యాభర్త ఇద్దరు కూలీ పనులు చేసుకుంటే కానీ కుటుంబం గడవని పరిస్థితి. దీంతో వారు బాధ వర్ణనాతీతంగా మారింది.. ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి మెరుగైన వైద్యం అందించి చేయి తీయకుండా ఉండేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.