ఖాతాదారుల్లో ఒక్కరైనా ఫిర్యాదు చేయకుండా మార్గదర్శిలో సోదాలు ఎలా చేస్తారని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి ప్రశ్నించారు. ఇది కక్ష సాధింపు చర్యగానే భావించాల్సి ఉంటుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపులకు తావులేదని, ఇలాంటి చర్యలకు ప్రజల మద్దతు ఉండదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ పనితీరు చూస్తుంటే, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుందని విమర్శించారు.
రామోజీరావుకు చెందిన ఈనాడు దినపత్రిక రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపైనా, కార్యక్రమాలపైనా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తుంటే, దాన్ని తట్టుకోలేక రామోజీరావుకు చెందిన మార్గదర్శిపై అక్రమ కేసులు బనాయించారని తులసిరెడ్డి ఆరోపించారు. మార్గదర్శిలో ఖాతాదారులుగా 2 లక్షల కుటుంబాలు ఉన్నాయని, వారిలో ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని వివరించారు. ఖాతాదారులు సంతోషంగానే ఉన్నారని, మరి వాళ్లకు లేని సమస్య ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకని తులసిరెడ్డి ప్రశ్నించారు. ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏసీబీ, జేసీబీ, పీసీబీ పేరిట దుష్ట సంస్కృతి నడుస్తోందని అన్నారు.