రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించాయి. ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. విజయనగరం, అనకాపల్లి కలెక్టరేట్ల వద్ద జరిగిన ధర్నాల్లో ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.... ప్రభుత్వానికి నాలుగేళ్లు సహకరించామని, ఇక ఉద్యమాన్ని ఆపేదిలేదని, సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమిస్తామని చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ అమరావతి స్టేట్ సెక్రటరీ జనరల్ పాలిశెట్టి దామోదర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప కలెక్టరే ట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. విశాఖ కలెక్టరేట్‌లోని ఎన్జీవో హోమ్ వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తిరుపతి కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో జిల్లా జేఏసీ ఛైర్మన్ గోపీనాధరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ఆలస్యంగా జీతాలు ఇస్తున్నందున ఈఎంఐలపై ఒత్తిడి తేవద్దని బ్యాంకర్లను అభ్యర్థిస్తామన్నారు.