తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండగగా ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది. తిరుమల శ్రీవారికి స్వయానా చెల్లెలు, తిరుపతి గ్రామదేవతగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి 900 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను ప్రతిబింబించే అపురూప జాతర ఇది. అలాంటి గంగమ్మ జాతరను రాష్ట్ర పండగగా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై గంగమ్మ జాతరను అధికారికంగా నిర్వహించనుంది.
తిరుపతి గంగమ్మ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది జాతర. అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారు. వారం రోజుల పాటు భక్తులు విచిత్ర వేషధారణలతో కనిపిస్తారు. పురుషులు మహిళల వేషం వేసుకుని డ్యాన్స్ చేస్తూ, అమ్మవారిని దర్శించుకుంటారు.
ఆలయం నిర్మించిన తర్వాత 12 ఏళ్లకు ఒకసారి కుంభాభిషేకం నిర్వహించడం ఆనవాయతీగా వస్తోంది. కుంభాభిషేకం జరిగి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
మరోవైపు మే 1వ తేదీ నుంచి 5 వరకు మహా కుంభాభిషేకం నిర్వహించాలని కంచి పీఠాధిపతులు తీర్మానించారు. తర్వాత మే 9న పుట్టింటి సారె, చాటింపుతో జాతర ప్రారంభమై.. 17న ముగియనుంది.