చిత్తూరు జిల్లా, డక్కిలి మండలం దగ్గవోలు గ్రామంలో వింత దొంగతనం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే... దగ్గవోలు గ్రామానికి చెందిన దంవోలు కృష్ణయ్య తన గొర్రెలను పొలాల్లో మేపుతూ మధ్యాహ్నం కావడంతో భోజనం కోసం ఇంటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన కొందరు దుండగులు రెండు పొట్టేళ్లను కారులో వేసుకొని నిండలి వైపు వాహనాన్ని మళ్లించారు. అక్కడే ఆటాడుకుంటున్న చిన్నారులు గమనించి గ్రామస్తులకు తెలియజేశారు. వెంటనే కృష్ణయ్య తదితరులు నిండిలి రోడ్డులో వున్న వారికి ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని చెప్పడంతో వారు రోడ్డుకు అడ్డంగా నిలబడి కారును ఆపే ప్రయత్నం చేశారు. దీంతో రోడ్డు పక్కనే వున్న మరో మార్గంలోకి కారును తిప్పిన లోపలున్నవారు బాలాయపల్లి వైపు మళ్లించారు. దీంతో నిండలి గ్రామస్తులు బాలాయపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సేష్టన్ వద్ద గూడూరు - వెంకటగిరి మార్గంలో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి కారును ఆపే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని దూరం నుంచే గమనించి కారును యూ టర్న్ చేసుకొని మన్నూరు వైపు మళ్లించారు.అప్రమత్తమైన బాలాయపల్లి పోలీసులు కారును వెంబడించారు. మన్నూరు గ్రామంలోకి చేరుకోగానే అక్కడ రోడ్డు డెడ్‌ఎండ్ కావడంతో కారును, పొట్టేళ్లను వదిలిపెట్టి పరారయ్యారు. వాటిని స్వాధీనం చేసుకున్న బాలాయపల్లి పోలీసులు ఈ సంఘటన డక్కిలి పరిధిలో జరగడంతో కేసును డక్కిలికి బదలాయించారు.కారు, పొట్టేళ్లను డక్కిలి పోలీసులకు అప్పగించారు.పట్టపగలే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో జనం విస్తుపోయారు.