కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ క్రమంలో రామచంద్రపురం మండలం తాళ్ళపాలెం గ్రామానికి చెందిన పిల్లి శ్రీను, ఉట్రుమిల్లికి చెందిన సీహెచ్ రాజశేఖర్ అనే ఇద్దరు కూలీలు ఇటుకల లోడు కింద కూరుకుపోయారు. ఈ క్రమంలో సమీపంలో వాకింగ్‌కి వచ్చిన పలువురు వ్యక్తులు, స్థానికులు హూటాహుటీన ఇటుకల తొలగింపు చర్యలు చేపట్టారు. దీనికి తోడు కరప మండలం పెద్దాపురప్పాడు సావారంనకు చెందిన మేడిశెట్టి లక్ష్మణ్ సకాలంలో స్పందించి తన ట్రాక్టర్ సహాయంతో ఇటుకల లోడు ట్రక్కును వెనక్కి లాగడంతో ఇటుకలలోడు కింద కూరుకుపోయిన ఇద్దరు కూలీలు ప్రాణాలను దక్కించుకుని గాయాలతో బయటపడ్డారు. వెంటనే వారిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఇరువురు కూలీలకు కాళ్లకు తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స పొందుతున్నారు.