ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీ మాఫియా డాన్,,,అతిఖ్ కుటుంబం మొత్తం జైల్లోనే, పరారీలో భార్య

national |  Suryaa Desk  | Published : Sat, Apr 15, 2023, 08:14 PM

ఉమేశ్ పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్ స్టర్ అతిఖ్ అహ్మద్ కుమారుడైన అసద్ అహ్మద్ ఇటీవల యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. గత 48 రోజుల్లో అతిఖ్ అహ్మద్ నేర సామ్రాజ్యాన్ని యోగి సర్కారు కూకటి వేళ్లతో పెకిలించింది. అతిఖ్ అహ్మద్, అతడి అనుచరులకు చెందిన రూ.1400 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. ఈ ఆస్తులన్నీ నేరాల ద్వారా సంపాదించినవేనని పోలీసులు తెలిపారు. ఈడీ కూడా రంగంలోకి దిగి రూ.100 కోట్లకుపైగా ఆస్తులు.. రూ.50 డొల్ల కంపెనీల గుట్టును బయటపెట్టింది. ఈ డొల్ల కంపెనీలను ఉపయోగించుకొని అతిఖ్ నేరాలు చేసి సంపాదించిన నల్ల ధనాన్ని వైట్‌గా మార్చుకునేవాడని తెలుస్తోంది.


అతిఖ్ అహ్మద్‌తోపాటు అతడి ఇద్దరు కుమారులు జైల్లో ఉండగా.. అతడి మూడో కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్లో హతమయ్యాడు. ఇద్దరు మైనర్ కుమారులు జువైనల్ హోంలో ఉండగా.. అతడి భార్య షైస్టా పర్వీన్ పరారీలో ఉంది. అతిఖ్ సోదరుడు అష్రఫ్ సైతం జైలు జీవితాన్ని గడపనున్నాడు.


రూ.1400 కోట్ల విలువైన అతిఖ్ గ్యాంగ్ ఆస్తులు జప్తు కాగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన 15 బృందాలు రూ.108 కోట్ల విలువైన ఆస్తులను బయటపెట్టడంతోపాటు.. అతిఖ్‌పై మనీలాండరింగ్ కేసుల విచారణను వేగవంతం చేశాయి. 50కిపైగా డొల్ల సంస్థలు వేరే వ్యక్తుల పేరిట నడుస్తున్నప్పటికీ అతిఖ్, అతడి గ్యాంగ్ ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ గుర్తించింది. అతిఖ్ ముఖ్య అనుచరులందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది.


అతిఖ్ అహ్మద్ మొదట్లో గ్యాంగ్ స్టర్, అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతడు.. 1989 నుంచి 2004 వరకు అలహాబాద్ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేశాడు. ఆ తర్వాత లోక్ సభకు ఎన్నికయ్యాడు. అతిఖ్ అహ్మద్‌పై వందకుపైగా కేసులు ఉన్నప్పటికీ.. 2017 ప్రారంభానికి ముందు వరకూ అతడు బెయిల్ తెచ్చుకొని బయట తిరిగేవాడు. 1979లో అంటే 44 ఏళ్ల క్రితం అతడిపై తొలిసారి కేసు నమోదైంది. కానీ గత ప్రభుత్వాలు అతడ్ని ఏ ఒక్క కేసులోనూ దోషిగా తేల్చలేకపోయాయి. ఉమేష్ పాల్ హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న యోగి సర్కారు విచారణ సరిగ్గా జరిగేలా చర్యలు తీసుకుంది. దీంతో తొలిసారి అతిఖ్ అహ్మద్‌కు గత నెలలో జీవిత ఖైదు పడింది.


శనివారం ప్రయాగ్‌రాజ్‌లో అసద్ అహ్మద్‌తోపాటు ఝాన్సీ ఎన్‌కౌంటర్లో అతడితోపాటు హతమైన గుల్హమ్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. ఈ సందర్భంగా ప్రయాగ్ రాజ్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జైల్లో ఉన్న అతిఖ్ అహ్మద్‌ మాత్రం కోర్టు అనుమతి లభించకపోవడంతో తన కొడుకు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. అతిఖ్ భార్య పరారీలో ఉండటంతో ఆమె కూడా తన కొడుకు అంత్యక్రియలకు హాజరు కాలేదు. దీంతో అతి కొద్ది బంధువులు, గ్రామస్థుల సమక్షంలో అసద్ అంత్యక్రియలు నిర్వహించారు.


2005 జనవరి 5న ప్రయాగ్‌రాజ్‌లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్, అతడి అనుచరులపై దాడి చేసి హతమార్చారు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న లాయర్ ఉమేష్ పాల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలే హత్యకు గురయ్యాడు. అతిఖ్, అతడి భార్య పర్వీన్, అతడి కుమారుడు అసద్ తదితరులు ఈ హత్య చేశారని ఉమేష్ పాల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మాఫియాను మట్టిలో కలిపేస్తానని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన యోగి ఆదిత్యనాథ్ మాట నెరవేరింది. దీంతో పొలిటిషీయన్ కమ్ గ్యాంగ్‌స్టర్ అయిన అతిఖ్ అహ్మద్ సామాజ్ర్యం కుప్పకూలింది. ఈ హత్య సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డయ్యింది. అతిఖ్ కుమారుడు అసద్ సహా ఐదుగుర్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణలో భాగంగానే అసద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com