ఢిల్లీ లిక్కర్ స్టేంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం నాడు పొడిగించింది. సీబీఐ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 27వ తేదీ వరకు, ఈడీ కేసుకు సంబంధించి ఏప్రిల్ 29వ తేదీ వరకు పొడిగించింది. నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా సీబీఐ తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది.
మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఫిబ్రవరి నెలలో సిసోడియాను అరెస్ట్ చేసింది. అంతకుముందు పలుమార్లు విచారించిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంది. విచారణకు ఆయన సహకరించడం లేదని, సరైన సమాధానాలు చెప్పడం లేదని చెబుతూ, ఆయన ముందు సాక్ష్యాలు పెట్టి విచారించినప్పటికీ సరైన సమాధానం చెప్పడం లేదని చెబుతూ సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మార్చి నెలలో ఈడీ మనీలాండరింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకుంది. ఆయనను ఈడీ తీహార్ జైల్లో విచారించింది.