తాను వివేకా కూతురు సునీతమ్మ నుండి డబ్బులు తీసుకున్నాననే ఆరోపణలను ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఖండించాడు. ఆమె వద్ద నుండి తాను ఒక్క రూపాయైనా తీసుకున్నట్లు నిరూపించినా జీవితాంతం జైల్లో ఉండేందుకు సిద్ధమని సవాల్ చేశాడు. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టే సీబీఐ అధికారులు విచారణకు పిలుస్తున్నారని వ్యాఖ్యానించాడు. సీఎం జగన్, అవినాశ్ రెడ్డిల నుండి తనకు ఇప్పటికీ ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.
తాను అప్రూవర్ గా మారడాన్ని చాలామంది విమర్శిస్తున్నారని, కానీ అప్రూవర్ గా మారిన సమయంలో తనను అవినాశ్ రెడ్డి లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశాడు. మీ వరకు రానంత వరకు దస్తగిరి అనే వ్యక్తి మంచివాడు.. ఇప్పుడు చెడ్డవాడు అయ్యాడా? అని ప్రశ్నించాడు. దస్తగిరి అనే వాడు సునీతమ్మ నుండి లేదా ఇతరుల నుండి పది రూపాయలు తీసుకున్నట్లు నిరూపించగలరా? అని ప్రశ్నించాడు. అసలు తాను అప్పుడే డబ్బుకు ఆశపడి ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లుగా చేశానని, ఇప్పుడు తనకు అవసరం లేదు కనుక సీబీఐకి నిజం చెప్పేశానని అన్నాడు.
వారికి పలుకుబడి ఉందని చెప్పి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ను కూడా మార్చేశారని ఆరోపించాడు. రామ్ సింగ్ ను మార్చితే కొత్త బృందం ఏమైనా కొత్త కోణంలో విచారిస్తుందా? అన్నాడు. కేసులో మీ పాత్ర ఉంది కాబట్టి ఎవరైనా అలాగే దర్యాప్తు చేస్తారన్నాడు. తాను తప్పు చేశానని, ప్రాయశ్చిత్తం చేసుకుందామనే అప్రూవర్ గా మారినట్లు చెప్పాడు. తాను పులివెందులలో వైఎస్ విజయమ్మ కాలనీలోనే ఉంటున్నానని, తాను ఎక్కడికీ పారిపోయేది లేదని, దేనికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు.
ఈ కేసులో నేను తప్పు చేస్తే నేను, మీరు తప్పు చేస్తే మీరు జైలుకు వెళ్తారు.. ఆందోళన ఎందుకు అన్నాడు. మీరు తప్పు చేసినట్లు రుజువు అయితే పదవులకు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశాడు. సీబీఐ ఉన్నతస్థాయి దర్యాఫ్తు సంస్థ అని, ఇందులో కీ రోల్ ఎవరిది అనేది వెలుగులోకి తెస్తుందన్నాడు. ఇటీవల జగన్ ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రధాని మోదీ ద్వారా ఏమైనా మేనేజ్ చేశారా అనే అనుమానం అవసరం లేదని, అలాంటివేమీ కుదరవని దస్తగిరి చెప్పాడు.