బెంగళూరు నగరంలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భారత ఐటీ రాజధాని బెంగళూరులో ఇళ్ల అద్దెలు ఐటీ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటా అద్దెల్లో భారీ పెరుగుదలతో వారు గగ్గోలు పెడుతున్నారు. కరోనా కారణంగా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇచ్చిన ఐటీ కంపెనీలు ప్రస్తుతం హైబ్రీడ్ మోడల్ పేరిట ఉద్యోగులను మళ్లీ కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. సగం పనిదినాలు ఆఫీసులో మిగతా సగం ఇంట్లోంచి పనిచేసుకునేందుకు మాత్రమే కంపెనీలు అనుమతించడంతో అనేక మంది ఐటీ ఉద్యోగులు మళ్లీ బెంగళూరుకు చేరుకుంటున్నారు. దీంతో ఫ్లాట్లు, పేయింగ్ గెస్ట్ అకామడేషన్ గదుల ధరలు ఆమాంతం పెరిగిపోయాయి.
ఓ అంచనా ప్రకారం.. కొవిడ్ తరువాత ఇళ్ల అద్దెలు ఏకంగా పావు శాతం మేర పెరిగాయట. ఈ ఏడాది కూడా 7 నుంచి 10 శాతం మధ్య రెంట్స్ పెరిగే అవకాశం ఉందని టెకీలు భయాందోళనలకు గురవుతున్నారు. అటు రియాల్టీ సెక్టర్, ఇటు విద్యారంగం జోరందుకోవడం పరిస్థితులను మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి.
అనారాక్ సంస్థ పరిశోధన ప్రకారం.. బెంగళూరులో సర్జాపూర్ రోడ్డులో వెయ్యి చదరపు అడుగుల సింగిల్ బెడ్‌రూం అద్దె రూ. 27 వేలు. దీనికి మెయింటెనెన్స్ అదనం. ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలు, బెలందూర్, మాన్యత టెక్ పార్క్ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. టెకీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇళ్ల ధరలు కళ్లు తేలేసే స్థాయిలో పెరుగుతాయని ఓ అంచనా.
ఫ్లాట్ల అద్దెల ఇలా భయపెడుతుంటే పేయింగ్ గెస్ట్ అకామడేషన్ కూడా టెకీలకు చుర్రుమనిపిస్తోంది. పీజీ అకామడేషన్ అద్దెలు సరాసరి 25 నుంచి 40 శాతం మేర పెరిగాయట. ముగ్గురు కలిసి ఉండే షేరింగ్ రూం అద్దె ప్రస్తుతం రూ. 13 వేలు కాగా సింగిల్ రూం అద్దె రూ. 21 వేలు. ఈ అద్దెల భారం మోయలేక టెకీలు ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దె ఇళ్లల్లో ఉండే వారి కోసం ప్రత్యేకంగా కొన్ని యూనియన్లు ఏర్పాటు చేసుకోవాలని కూడా కొందరు అభిప్రాయపడ్డారు.