మలేసియాకు చెందిన పారిశ్రామికవేత్త ఫర్హానా జహ్రాకు ఒక్కతే కూతురు.. పేరు ఫాతిమా, వయసు ఐదేళ్లు. ఇటీవల అనారోగ్యం కారణంగా ఫాతిమా కొన్నిరోజులు స్కూలు మానేసింది. ఆరోగ్యం బాగుపడ్డాక తిరిగి స్కూలుకు వెళ్లనంటూ మారాం చేసింది. దీంతో కూతురును స్కూలుకు పంపేందుకు ఓ మంచి బహుమతి ఇవ్వాలని ఫర్హానా భావించారు. ఫాతిమా పుట్టిన రోజు సమీపిస్తుండడంతో ఏం గిఫ్ట్ కావాలని అడగగా.. బీఎండబ్ల్యూ లేదా మెర్సిడెస్ జి వ్యాగన్ కావాలని ఫాతిమా అడిగింది.
ఆ కారు కొనిస్తే రోజూ స్కూలుకు వెళతానని ఫాతిమా చెప్పడంతో ఫర్హానా కూడా ఒప్పుకున్నారు. అన్నట్లుగానే ఫాతిమాకు మెర్సిడెస్ బెంజ్ కారును పుట్టిన రోజు బహుమతిగా కొనిచ్చారు. ఈ విషయం లోకల్ మీడియాకు చెప్పడం, వారు పబ్లిష్ చేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఫాతిమాను అభినందిస్తూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయితే, మరికొందరు నెటిజన్లు మాత్రం ఫర్హానా తీరును తప్పుబడుతున్నారు. ఐదేళ్ల పాప అడిగిందని బెంజ్ కారు కొనివ్వడమేంటని విమర్శిస్తున్నారు. డబ్బుకు కొదవలేదని పిల్లలు అడిగిందల్లా కొనిచ్చి వారిని చెడగొట్టొద్దని సలహా ఇస్తున్నారు.