బఠిండా మిలటరీ స్టేషన్‌లో గత బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో ఓ సైనికుడ్ని అదుపులోకి తీసుకున్నట్టు పంజాబ్ పోలీస్ వర్గాలు తెలిపాయి. నిద్రపోతున్న సైనికులపై గుర్తుతెలియని వ్యక్తులు జరపిన కాల్పుల్లో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తన సహచరులపై మోహన్ దేశాయ్ అనే సైనికుడు కాల్పులకు తెగబడినట్టు అంగీకరించినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత వివాదంతోనే ఘాతుకానికి పాల్పడినట్టు వెల్లడించాడని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.
కాల్పుల ఘటనపై ఆదివారం నలుగురు జవాన్లను విచారించినట్టు తెలిపాయి. మేజర్ అశుతోష్ శుక్లా స్టేట్‌మెంట్ ఆధారంగా ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఏప్రిల్ 12 న చోటుచేసుకున్న ఈ ఘటన.. రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లపై సందేహాలను లేవనెత్తింది. ప్రత్యేకించి వేర్పాటువాద సిక్కు బోధకుడు అమృతపాల్ సింగ్, అతడి సంస్థ వారిస్ పంజాబ్ దేపై భారీ అణిచివేతకు ప్రతీకార ఊహాగానాల మధ్య ఇది జరిగింది. అయితే, ఆ విషాద ఘటనకు, ఖలిస్థానీ నేతకు ఎటువంటి సంబంధం లేదని తాజా అరెస్ట్ సూచిస్తుంది.
కాల్పుల ఘటన తర్వాత ఇన్సాస్ అసాల్ట్ రైఫిల్ రెండు రోజులు కనిపించకుండా పోవడంతో ఘటన వెనుక కొందరు సిబ్బంది హస్తం ఉండొచ్చని అనుమానించిన ఆర్మీ వారిని ఆ తర్వాత గుర్తించింది. తెల్లవారుజామున 4:30 గంటలకు కాల్పులు జరిగాయని, కుర్తా-పైజామాలో కొందరు గుర్తుతెలియని మాస్క్‌లు ధరించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వారిలో ఒకరి వద్ద INSAS అసాల్ట్ రైఫిల్ ఉండగా, మరొకరు గొడ్డలిని పట్టుకుని సైనిక స్థావరం సమీపంలోని అడవి వైపు పారిపోయారని పేర్కొంది. 20 ఏళ్ల మధ్యలో ఉన్న నలుగురు జవాన్లు వారి గదుల్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సంఘటనపై వివరించినట్టు వర్గాలు తెలిపాయి.