గత శనివారం రాత్రి హత్యకు గురైన ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగస్టర్ కమ్ పొలిటీషియన్ అతీఖ్ అహ్మద్.. 2008లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో యూపీఏ ప్రభుత్వం గట్టెక్కడానికి సహకరించారు. అమెరికాతో అణు ఒప్పందం నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు బయట నుంచి ఇస్తోన్న మద్దతును ఉపసంహరించుకున్నాయి. దీంతో యూపీఏ బలం 228కి పడిపోగా.. ఇదే సమయంలో ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. మైనార్టీలో పడిన మన్మోహన్ ప్రభుత్వానికి సమాజ్‌వాదీ, ఆర్ఎల్డీ వంటి పార్టీల మద్దతు అవసరమైంది. అప్పటికి ఎంపీగా ఉన్న అతీక్ అహ్మద్‌ను ఎస్పీ బహిష్కరించినా మన్మోహన్‌కు అనుకూలంగా ఓటేశారు. అతీక్ సహా ఆరుగురు నేరచరిత్ర ఉన్న ఎంపీలు యూపీఏకు మద్దతుగా నిలిచారు.
ఈ విషయాన్ని రాజేశ్ సింగ్ అనే రచయిత తన పుస్తకంలో వెల్లడించారు. సుమారు 100కుపైగా కేసులున్న ఆరుగురు ఎంపీలపై ‘బాహుబలీస్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్: ఫ్రం బుల్లెట్ టు బ్యాలెట్’ అనే పేరుతో రాజేశ్ సింగ్ రాసిన పుస్తకంలో అతీక్ పేరును ప్రస్తావించారు. అమెరికాతో అణు ఒప్పందం విషయంలో వీరి ఓట్లే యూపీఏ ప్రభుత్వాన్ని, భారతదేశ పౌరులను రక్షించడంలో కీలకంగా వ్యవహరించాయని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వాన్ని పతనం నుంచి రక్షించిన గ్యాంగ్‌స్టర్-రాజకీయవేత్తలో ఒకరిగా ఎలా గుర్తింపు పొందారో వివరించారు.
పౌర అణు ఒప్పందాన్ని కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయంపై వామపక్షాలు 2008 మధ్యకాలంలో మద్దతును ఉపసంహరించుకున్నాయి. ‘లోక్‌సభలో యూపీఏకు సంఖ్యా బలం 228 కాగా.. అవిశ్వాస నుంచి గట్టెక్కాలంటే ధారణ మెజారిటీకి 44 సీట్లు తక్కువ.. అయితే, తమ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందని ప్రధాని మన్మోహన్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో తర్వాత స్పష్టమైంది’ అని సింగ్ రాశాడు.
‘సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, జనతాదళ్ (ఎస్), అతీక్ అహ్మద్ సహా బాహుబలి నేతలు, ఇతర పార్టీలు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేశాయి. ఓటింగ్‌కు 48 గంటల ముందు 100కిపైగా కిడ్నాప్, హత్య, దోపిడీ, దహనం, తదితర కేసులను ఎదుర్కొంటున్న దేశంలోని అత్యంత నేరచరితులైన ఆరుగురి ఎంపీలను ప్రభుత్వం బహిష్కరించింది. వారిలో ఒకరు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు అతీక్ అహ్మద్..’ అని పుస్తకంలో వివరించారు.
ఐదుసార్లు యూపీ శాసనసభకు ఎన్నికైన అతీక్ అహ్మద్.. 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ నుంచి పోటీచేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. తనను తాను రాజకీయ నాయకుడిగా, కాంట్రాక్టర్‌గా, బిల్డర్‌గా, ప్రాపర్టీ డీలర్‌గా, వ్యవసాయవేత్తగా చెప్పుకునే అతీక్.. కిడ్నాప్‌లు, హత్యలు, దోపిడీలకు పాల్పడినట్టు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి.