ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకొన్నా అమెరికాలో గన్ కల్చర్ మాత్రం మారడంలేదుతా. తాజాగా అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. పుట్టినరోజు వేడుకల్లో చోటుచేసుకున్న కాల్పుల్లో కనీసం నలుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. అలబామా రాష్ట్రం డాడేవిల్లేలోని ఓ డ్యాన్స్ స్టూడియోలో శనివారం రాత్రి 16 ఏళ్ల బాలిక పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో కనీసం 20 మందికి బుల్లెట్ గాయాలైనట్టు పేర్కొంది. కాల్పుల ఘటనలో నలుగురు చనిపోయారని, పలువురికి గాయాలయ్యాయని అలబామా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికార ప్రతినిధి సార్జెంట్ జెర్మై బుర్కెట్ తెలిపారు.
మరణించిన వారిలో తన మనవడు ఫిల్ డౌడెల్ కూడా ఉన్నాడని మోంట్‌గోమేరీ అడ్వర్టైజర్ అన్నెట్ అలెన్ చెప్పారు. తన సోదరి పుట్టినరోజు పార్టీలో తుపాకీ కాల్పులు జరిగినప్పుడు అతను గాయపడినట్టు తెలిపారు. ‘చాలా నిరాడంబరమైనవాడు.. ఎవరితోనూ ఎప్పుడూ గొడవపెట్టుకోడు.. ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది’ అని అలెన్ తన మనవడి గురించి తలచుకుని కన్నీటిపర్యంతమైంది. డౌడెల్ తల్లి కూడా కాల్పుల్లో గాయపడ్డారని ఆమె చెప్పారు. డాడేవిల్లేలోని ప్రతి ఒక్కరూ దుఃఖంలో మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటన జరిగిన 24 గంటలైనా అనుమానితుడ్ని గుర్తించారా? పట్టుకున్నారా? సహా ఎటువంటి వివరాలను అధికారులు వెల్లడించలేదు. అలాగే, ఎంత మంది గాయపడ్డారనేది స్పష్టత రాలేదు. ఈ సమయంలో తాము ఎటువంటి వివరాలను వెల్లడించలేమని సార్జెంట్ వ్యాఖ్యానించారు. అయితే, స్థానిక మీడియా మాత్రం చాలా మంది గాయపడ్డారని, ఎక్కువ మంది టీనేజర్లేనని పేర్కొంది. ప్రస్తుతం వీరికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోన్నట్టు తెలిపింది. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఈ హింసను రాష్ట్ర నాయకులు ఖండించారు. కానీ, ఏమి జరిగిందో వివరాలను అందించలేదు. అలబామా గవర్నర్ కే ఐవే ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘ఈ ఉదయం డాడెవిల్లే ప్రజలు, నేను ఎంతో ఆవేదన చెందుతున్నాం.. హింసాత్మక ఘటనలకు మా రాష్ట్రంలో స్థానం లేదు.. లా అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో కలిసి పనిచేస్తున్నాం’ అని అన్నారు. దాదాపు 330 మిలియన్ల జనాభా ఉన్న అమెరికాలో దాదాపు 400 మిలియన్ తుపాకులతో అల్లకల్లోలంగా ఉంది. ఘోరమైన సామూహిక కాల్పులు నిత్యం జరుగుతున్నాయి.