తన సంతానంపై ఏ తల్లికైనా అమిత ప్రేమ ఉంటుంది. తన ప్రాణాలను పణంగా పెట్టేంత ప్రేమ అది మనిషికైనా... జంతువుకైనా. పోతన రాసిన గజేంద్ర మోక్షం గుర్తుందా..? చెరువులోకి దిగిన గజరాజు.. మొసలితో పోరు పడలేక ప్రాణాలను కాపాడుకోవడం కోసం విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. గజేంద్రుడి మొర ఆలకించిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికి మాటమాత్రమైనా చెప్పకుండానే భూలోకానికి బయల్దేరి వచ్చి.. సుదర్శన చక్రంతో మొసలి తలను ఖండించి గజేంద్రుణ్ని రక్షిస్తాడు. ఒకప్పుడు గజేంద్రుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి విష్ణుమూర్తిని ప్రార్థించాల్సి వచ్చింది. కానీ తన బిడ్డకు మొసలి నుంచి ఆపద వస్తే.. ఆ ఏనుగు స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన చిన్నారి ఏనుగు పిల్లను తీసుకొని ఓ ఏనుగు చిన్న నీటి మడుగు వద్దకు వెళ్లింది. రెండూ కలిసి నీళ్లలోకి దిగగా.. కాసేపటి తర్వాత అందులోని మొసలి గున్న ఏనుగుపై దాడి చేయబోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన తల్లి ఏనుగు మొసలిపై ఆగ్రహంతో కన్నెర్రజేసింది. మొసలి నోరు తెరుచుకొని పైకి లేవగా.. తన బిడ్డను కాళ్ల కిందకు లాక్కున్న తల్లి ఏనుగు.. ముందు కాలితో మొసలిని తొక్కి చంపేందుకు ప్రయత్నించింది. ఏనుగు దెబ్బకు తాళలేక మొసలి ఆ మడుగు నుంచి బయటకు పారిపోయింది. తన బిడ్డకు ఆపద వస్తే తల్లి ఏం చేయడానికైనా వెనుకాడదని ఈ ఏనుగు నిరూపించింది.
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద ఈ వీడియోను ట్వీట్ చేశారు. తమ పిల్లలను కాపాడుకోవడానికి ఏనుగులు చేసిన పోరాటం అద్భుతమని సుశాంత వ్యాఖ్యానించారు. ఏనుగుకు మొసలి లొంగిపోయిందన్నారు. ఈ వీడియో పట్ల నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నీటి మడుగు చిన్నదిగా ఉండటంతో మొసలికి బలం సరిపోలేదని.. అదే కొంచెం పెద్దగా ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంకలో యాలా నేషనల్ పార్కులో టూరిస్టులు తీసిందని భావిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు వ్యక్తులు తమ వాహనంలో కూర్చొని ఈ వీడియో తీశారని స్పష్టంగా తెలుస్తోంది.
గతంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఏనుగుల మంద నీళ్లు తాగడానికి ఓ తటాకం దగ్గరకు వెళ్లగా.. ఓ మొసలి అదను చూసి ఏనుగు పిల్ల తొండాన్ని గట్టిగా పట్టుకుంది. ఆ ఏనుగు పిల్ల బాధతో అరుస్తూ బయటకొచ్చినప్పటికీ.. మొసలి తొండాన్ని వదల్లేదు. పక్కనే ఉన్న ఏనుగు మొసలిపై దాడి చేసి దాని బారి నుంచి గున్న ఏనుగును కాపాడింది. తల్లి ఏనుగు తన బిడ్డను కాపాడుకుందని.. ఒకవేళ మొసలి గనుక వదిలిపెట్టకపోయి ఉండుంటే.. దాని తలను ఏనుగు తొక్కి పచ్చడి చేసేదని నెటిజన్లు కామెంట్ చేశారు.