కర్ణాటకలో బీజేపీ విద్వేష రాజకీయాలు చేస్తున్నందున కాంగ్రెస్‌నే విజయం వరిస్తుందని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య స్పష్టంచేశారు. ప్రధాని మోదీ మ్యాజిక్ కర్ణాటకలో పనిచేయదని తేల్చి చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో పాటూ తాను సీఎం పదవి రేసులో ఉన్నానని, అయితే సీఎం ఎవరయ్యేది హైకమాండ్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ‘‘నాకు, శివకుమార్‌కు మధ్య ఎటువంటి తగాదా లేదు. ఎన్నికల తరువాత సీఎం ఎవరవుతారనేది పార్టీ హైకమాండ్, కొత్త ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు’’ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రాజకీయంగా కీలకమైన లింగాయత్ వర్గం తమ పార్టీ విధానాల్ని అర్థం చేసుకుందని అన్నారు. వారి మద్దతు కాంగ్రెస్‌కు ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ విద్వేష రాజకీయాలకు పాల్పడుతోందంటూ దుమ్మెత్తిపోసిన సిద్దరామయ్య.. హలాల్, అజాన్, హిజాబ్ విషయాలను కాషాయ పార్టీ ఇప్పుడెందుకు లేవనెత్తుతోందని ప్రశ్నించారు. ముస్లింలకు కాంగ్రెస్ వంతపాడుతోందన్న బీజేపీ ఆరోపణలను ఆయన ఖండించారు. బీజేపీ అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని సాగనంపేందుకు రెడీ అని సిద్ధరామయ్య చెప్పారు.