చిత్తూరు జిల్లా, పుంగనూరు లో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... పుంగనూరు మండలంలోని సింగిరిగుంట పంచాయతీ మార్లపల్లెకు చెందిన అడ్వకేట్ సి.అంజప్ప కుమారుడు సి.నిరంజన్ (45) గ్రామ సమీపంలోని ఇంట్లో నివాసం ఉన్నాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతోపాటు అవివాహితుడు కావడంతో ఒక్కడే ఉంటున్నాడు. ఇంట్లో దోమల బారినుంచి తప్పించుకోవడానికి పొగ పెట్టాలనుకున్నాడు. ఇందుకోసం కొన్ని కట్టెలు, ఆకులు వేసి అగ్గికుంపటి రాజేసి, పడుకున్నాడు. సోమవారం తెల్లవారు జామయ్యేసరికి కుంపటిలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న టెంకాయ ఆకులు, కట్టెలకు అంటుకుని, ఇల్లు మొత్తం వ్యాపించాయి. మెలకువ వచ్చిన నిరంజన్ ఆ మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయబోయాడు. ఇంతలో కాలిన తలుపు మీదపడటంతో అపస్మారకస్థితికి చేరుకుని సజీవదహనం అయ్యాడు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.