తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీకి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వచ్చామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కియా మోటార్స్ తో ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. కానీ జగన్ మాత్రం కడప స్టీల్ ప్లాంట్ కు మూడుసార్లు ఫౌండేషన్ స్టోన్ వేశారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికే కడప స్టీల్ ప్లాంట్ పూర్తయ్యేదని చెప్పారు. జాబు రావాలంటే టీడీపీ రావాల్సిందే అన్నారు. జగన్ సీఎంగా ఉంటే పోలవరం పూర్తి కాదని, అప్పుడు శ్రీశైలంకు నీళ్లు రావని, తద్వారా రాయలసీమకు నీళ్లు రావన్నారు. అంటే రాయలసీమ ద్రోహిగా జగన్ నిలిచిపోతారన్నారు. తాము పట్టిసీమను పూర్తి చేశాం కాబట్టే ఇప్పుడు అక్కడ నీరు వస్తోందన్నారు.
జగన్ రాష్ట్రానికి ఓ దరిద్రమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. "ఆయన ఒక సైతాన్... రాష్ట్రానికి పట్టిన శని... మనల్ని పట్టిపీడిస్తున్న భూతం" అని అన్నారు. తాను నాలుగేళ్లుగా చూస్తున్నానని, ఒక్కరు కూడా ఈ పాలనలో కంటినిండా నిద్ర పోవడం లేదన్నారు. పోలీసులు కూడా ఆనందంగా లేరన్నారు. వారికి డీఏలు లేక, వేతనాలు సరిగ్గా రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు, ఎస్సీ, ఎస్టీలు, వ్యాపారులు, ఉద్యోగులు... ఇలా ఎవరి పరిస్థితీ బాగా లేదన్నారు.