వివేకా హత్య కేసు నిందితులు చివరకు సీబీఐ అధికారులను కూడా బెదిరించారన్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు... ప్రపంచ పోలీసు అధికారులకు ఓ కేస్ స్టడీ వంటిదని ఆయన అన్నారు. మంగళవారం ఆయన కడపలో ఏర్పాటు చేసిన టీడీపీ జోన్-5 సమావేశంలో మాట్లాడారు. వివేకాను గొడ్డలితో నరికి చంపి, గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. వివేకా హత్య కేసు నిందితులు చివరకు సీబీఐ అధికారులను కూడా బెదిరించారన్నారు. తన తండ్రిని చంపిన వారు ఎవరో తెలియాలని వివేకా కుమార్తె పోరాడుతోందన్నారు. వివేకా హత్య కేసును ప్రజా కోర్టులో పెడతామన్నారు.
రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పోవాలని పిలుపునిచ్చారు. సీమలో ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా అణిచివేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అన్నారు. కానీ జగన్ హయాంలో రౌడీలు రెచ్చిపోతున్నారన్నారు. రౌడీల తోకలు కట్ చేస్తాం... జాగ్రత్త! అంటూ హెచ్చరించారు. అడ్డువచ్చిన వారిని అందరినీ చంపేస్తారా అని ధ్వజమెత్తారు. పరిపాలన చేయాలని రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓటు వేశారని, కానీ హత్యలు, దౌర్జన్యాలు, బలహీన వర్గాల పైన దాడులు పెరిగాయన్నారు.