చోడవరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. తనలో ఓ సింగర్ కూడా ఉన్నారని.. తన టాలెంట్‌ను ఇలా బయటపెట్టారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కోత్తకోటలో పర్యటించారు. ఆ ఊరిలో ఉండే సంగీత కళాకారుడు లక్ష్మణరావు ఇంటి దగ్గరకు వెళ్లారు ధర్మశ్రీ. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వివరించిన ఆయన.. అక్కడ సంగీత కళాకారుడి లక్ష్మణరావు విజ్ఞప్తి మేరకు ధర్మశ్రీ పాటపాడి అలరించారు. ధర్మశ్రీ పాటపాడటంతో అందరూ ఒకింత ఆశ్చర్యపోయారు. లక్ష్మణరావు తబలా వాయించగా.. ఎమ్మెల్యే పాటపాడి అదరగొట్టారు. ధర్మశ్రీ ప్రొఫెషనల్ సింగర్‌లాగా చక్కగా పాడారు.. పాట పడినంత సేపు అక్కడున్న వాళ్లంతా అలా చూస్తుండిపోయారు. తమ ఎమ్మెల్యే ఇంత టాలెంట్ ఉందా? అని వైసీపీ కార్యకర్తలతో పాటు ప్రజలు ఆశ్చర్యపోయారు. అంతేకాదు ధర్మశ్రీ 2021లో తన కుమార్తె వివాహ వేడుకలో కూడా పాట పాడి అలరించారు. రెండో కుమార్తె వివాహం విశాఖ బీచ్ రోడ్డులోని ఎంజీఎం పార్కులో జరిగింది. ఈ వేడుకకు మంత్రులు, ఎంపీలు, అధికారులు హాజరయ్యారు. కుమార్తె పెళ్లిలో ధర్మశ్రీ మైక్ అందుకున్నారు. ఆయన ఆల్ టైమ్ హిట్ సాంగ్ నన్ను దోచుకుందువతే వన్నెల దొరసానీ అంటూ పాట అందుకున్నారు. ఈ వీడియో అప్పట్లోనే వైరల్ అయ్యింది.
అంతేకాదండోయ్ ధర్మశ్రీలో నటుడు కూడా ఉన్నారు. ఆయన గతంలో ఓ సినిమాలో కూడా నటించారు.. ఎమ్మెల్యే ఇంట్లో షూటింగ్ జరగ్గా.. ఎమ్మెల్యే ధర్మశ్రీపై పరమశివుడికి తపోభంగం చేయటానికి వచ్చిన మాంత్రికుడి మధ్య జరిగిన సీన్‌ను షూట్ చేశారు. ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. ధర్మశ్రీకి నటన అంటే చాలా ఇష్టం.. ఊళ్లో కూడా ఎన్నో నాటకాలు వేశారు. తన నటనతో గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రశంసలు అందుకున్నారట.
అంతేకాదు ఆయనకు ఇటీవల 1998 డీఎస్సీలో ప్రభుత్వం ఉపాధ్యాయుడి ఉద్యోగం కూడా వచ్చింది. ధర్మశ్రీ 1998లో డీఎస్సీ రాసి అర్హత సాధించారు.. కానీ కొన్ని కోర్టు వివాదాలతో ఉద్యోగం అప్పుడు రాలేదు. ఇటీవల ఆ సమస్యలన్నీ ఓ కొలిక్కి రావడంతో వారికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం ఆసక్తి చూపలేదు.. రాజకీయాల్లోనే కొనసాగుతాను అన్నారు. అయితే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా సరే తనకు ఉన్న నటన, సింగింగ్ టాలెంట్స్‌ను మాత్రం మర్చిపోలేదు.. అవకాశం దొరికినప్పుడల్లా తన మల్టీ టాలెంట్ బయటపెడుతున్నారు.