వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువైపోయింది. ఎండ తీవ్రత కొనసాగడంతో పాటు వడగాడ్పులు వీస్తున్నాయి. పడమర దిశ నుంచి వీస్తున్న పొడిగాలులకు ఉదయం పది గంటలకే వాతావరణం వేడెక్కింది. అనేకచోట్ల 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా వడమాలపేటలో గరిష్ఠంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా శుక్రవారం కూడా పలుచోట్ల వడగాడ్పులు వీస్తాయని, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కాగా, ఎండ తీవ్రత, సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు పడనున్నాయి. ఈనెల 22 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు స్వల్పంగా పెరగనున్నాయి. ఈనెల 25 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎండలు స్వల్పంగా తగ్గుతాయని వాతావరణ నిపుణుడు తెలిపారు. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా రానున్న 48 గంటలు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం తగ్గనుందని, రెండు రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది.