రాబోయే 25 ఏళ్లలో.. పెద్ద లక్ష్యాలను సాధించేందుకు దేశం వేగంగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ ఏడాది 'సివిల్ సర్వీస్ డే' ఎంతో ఘనంగా నిర్వహించారు. దీంట్లో పాల్గొన్ననరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ చెల్లింపుల్లో మనం స్థానంలో ఉన్నామని.. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని వ్యాఖ్యానించారు.
'ఈ రోజు నేను భారతదేశంలోని ప్రతి పౌర సేవా అధికారికి ఒకటి చెప్పదల్చుకున్నా. మీరు చాలా అదృష్టవంతులు. ఈ కాలంలో దేశానికి సేవ చేసే అవకాశం మీకు లభించింది. మనకు తక్కువ సమయం ఉంది. కానీ ఎక్కువ సామర్థ్యం ఉంది. మన లక్ష్యాలు కష్టం. కానీ మన ధైర్యం తక్కువ కాదు. మనం పర్వతాన్ని అధిరోహించవలసి ఉంటుంది.. కానీ మన ఉద్దేశాలు ఆకాశం కంటే ఉన్నతమైనవి' అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
'మన ప్రణాళికలు ఎంత గొప్పగా ఉన్నా.. అవి కాగితంపై ఎంత బాగున్నా.. చివరి వ్యక్తికి డెలివరీ అవ్వడం ముఖ్యం. సివిల్ సర్వీస్ అధికారులు దేశాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదలకు సుపరిపాలన అందించడానికి.. దేశంలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గత తొమ్మిదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. దాని వెనుక వారి కృషి ఉంది. 9 ఏళ్లలో దేశంలోని నిరుపేదలు సుపరిపాలనపై నమ్మకం పెంచుకున్నారు. కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ.. నేడు భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ' అని మోదీ వివరించారు