మార్కెట్లో చింతపండు ధరల పతనంతో రైతులు దిగులు పడుతున్నారు. చింతచెట్ల నుంచి పండును కోసేందుకు కూడా జంకుతున్నారు. అయితే శనివారం ఉదయం హుకుంపేట శనివారం వారపు సంతలో పలు గ్రామాల రైతులు చిరువ్యాపారులకు చింతపండును అమ్ముదామని తీసుకొచ్చిన ఇటు వ్యాపారులు కొనలేదు జిసిసి అధికారులు పట్టించుకోలేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విక్రయాల సీజన్ ప్రారంభమైన 3 వారాలకే ఇలా ఉండడంతో చింత రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వ్యవసాయ మార్కెట్ యార్డు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడంతో కమీషన్ ఏజెంట్ ట్రేడర్లు చెప్పింది ధర అన్నట్లుగా తయారైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చింతపండుకు గిట్టుబాటు ధర కల్పించి రైతులకు న్యాయం చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.