ప్రకృతి వ్యవసాయం చేద్దాం.. నేల తల్లికి జీవం పోద్దామని కర్నూలు కలెక్టర్ డా.జి.సృజన పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమీక్ష సమావేశంలో ప్రకృతి వ్యవసాయ ప్రాము ఖ్యత గురించి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జేసీ నారపురెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, సుధాకర్, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ బెల్లం మహేశ్వరరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ విజయలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ చంద్రశేఖర్, కన్సల్టెంట్ లక్ష్మయ్య, ఏడీఏలు శాలురెడ్డి, మహమ్మద్ ఖాద్రి, గిరీష్, సునీత, బలవర్ద రాజు, శ్రీనివాస్, సురేస్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సందీప్ కుమార్ హాజరయ్యారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ పోస్టర్లను విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రసాయనాలు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడటంతో నేడు భూమి, నీరు, గాలి కలుషితమవు తున్నాయన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి పంటలను సాగు చేసి పండించినటువంటి ఆహారం తినడం వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా దీర్ఘకాలంలో పర్యావరణం దెబ్బతినకుండా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతి వనరులను అందించే దిశగా కృషి చేయాలన్నారు.