మచిలీపట్నం న్యాయవాదుల సంఘ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. శుక్రవారం సంఘ అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ను ప్రస్తుత బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల ప్రసాద్ ఉపసంహరించుకున్నారు. ముగ్గురు రంగంలో ఉన్నారు. జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీవీ వరదరాజులు, సీనియర్ న్యాయవాది జీవీఎల్ నరసింహారావు, తుంగల హరిబాబు బరిలో ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి ముఖాముఖి పోటీ ఏర్పడింది. ఎస్ఎస్ఎస్ సాయిబాబు, కొట్టి రఘురాం బరిలో ఉన్నారు. ఈనెల 28న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. 196 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్టు ఎన్నికల అధికారి వింజమూరి శివరామ్ తెలిపారు. మిగిలిన పోస్టులు ఏకగ్రీవమయ్యాయి.