కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామానికి చెందిన శంకర్ నాయక్ (45)హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పామిడి సీఐ కిరణ్ కుమార్ రెడ్డి శనివారం తెలిపారు. వ్యవసాయంతో కుటుంబ పోషణ చేసుకుంటున్న శంకర్ నాయక్ కు అదే గ్రామానికి చెందిన మంగళ రాజీ అను మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. ఈ క్రమంలో ఆమెకు లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాడు. భర్త మృతితో రాజీ పామిడి మండలం రమగిరిలోని పుట్టింటికి వెళ్ళి తల్లితో జీవిస్తోంది. దీంతో శంకర్ నాయక్ రామగిరి వెళ్లి వస్తూ మద్యం మత్తులో తను ఇచ్చిన లక్ష రూపాయలు ఇవ్వాలని గొడవపడేవాడు. దీంతో శంకర్ నాయక్ ను హతమార్చాలని తన తల్లి సమీప బంధువైన విడపనకల్లు మండలం వి. కొత్తకోట గ్రామ నివాసి సాయినాథ్ తో కలిసి పథకం వేసింది. ఇందులో భాగంగా ఈనెల 9 వ తేదీన రామగిరికి వచ్చిన శంకర్ నాయక్ రాత్రి 9గంటలకు రాజీ తో గొడవపడ్డాడు. అప్పటికే పథకం వేసుకున్న రాజీ సిద్ధంగా ఉంచుకున్న కారంపొడి అతడి కళ్ళలో కొట్టింది. తల్లి శంకర్ నాయక్ రెండు కాళ్ళు కదలకుండా పట్టుకోగా సాయినాథ్ సూరకత్తి, రాజీ కూరగాయల కత్తితో గొంతు కోశారు.
అనంతరం అదేరోజు రాత్రి 11. 30 గంటలకు శంకర్ నాయక్ మృత దేహాన్ని గోనె సంచిలో వేసి స్కూటర్ పై తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ పై పడేసి ఆత్మహత్యా చిత్రీకరిం చారు. గోనె సంచిని కొద్ది దూరంలో కాల్చి వేశారు. అనంతరం పోలీసు విచారణ కు భయపడి రామగిరి వీఆర్వో ద్వారా పోలీసులకు లొంగిపోయారు. నిందితులపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఆదేశం మేరకు రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు.