తాను మైత్రి మూవీ మేకర్స్ సంస్ధలో పెట్టుబడులు పెట్టినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని సవాల్ చేశారు. జనసేన నేతలు నిరూపిస్తే తాను రాజకీయల నుంచి పూర్తగా తప్పుకుంటానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో తాను పెట్టుబడులు పెట్టినట్లు జనసేన నేతలు చేస్తున్న ఆరోపణలపై బాలినేని స్పందించారు. జనసేన నేతలు చేస్తున్న ఆరోపణల్లో అసలు వాస్తవం లేదని, తనకు సినీ ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు.
దిల్ రాజు వంటి స్నేహితులు ఇండస్ట్రీలో చాలామంది తనకు ఉన్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. స్నేహితులు ఉన్నంత మాత్రాన పెట్టుబడులు పెట్టానని ఆరోపించడం సరికాదని సూచించారు. జనసేన నేతలు తనను టార్గెట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని, తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఆస్తులన్నీ రాసిస్తానని బాలినేని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే జనసేన నేతలపై పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవడానికి సిద్దమైనా? అని ప్రశ్నించారు. జనసేన కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
'జనసేన నాయకుడు మూర్తి యాదవ్ మతిపోయి మాట్లాడుతున్నాడు. వీరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్‌కి ఒంగోలులో పర్మిషన్ ఇప్పిస్తే ఆ సినిమాకి నేను పెట్టుబడి పెట్టానని ప్రచారం చేశారు. ఏ సినిమాకైనా నేను కానీ, నా వియ్యంకుడు కాని పెట్టుబడి పెట్టానని నిరూపిస్తే రాజకీయాలకు స్వస్తి చెబుతా. నిరూపించకలేకపోతే నీ నాయకులపై చర్యలు తీసుకొంటారా?టీడీపీ నేత దామచర్ల జనార్దన్ రాజుపాలెంలో డికే లాండ్ లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యలేదా...? జనార్థన్ నీ బాగోతం బయటపెడతా. సినీ ఫీల్డ్‌లో పవన్ కళ్యాణ్‌కు మంచి పలుకుబడి ఉంది. మైత్రి మూవీస్‌లో పెట్టుబడి నేను పెట్టానో లేదో కనుక్కొమను. నా మీదకు ఐటీని ఉసిగొల్పాలని చూస్తున్నారు.. నేనేంటో జిల్లా ప్రజలకు తెలుసు. పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోను. 2002లో కొన్న స్థలానికి ఇప్పుడు కొన్నట్టు లింక్ పెడుతున్నారు' అని బాలినేని మండిపడ్డారు.
'అడ్డగోలు రాతలు రాసే ఈనాడుకి కళ్లు కనపడలేదేమో.. దొంగ కథనాలు రాస్తారా..? ఈనాడుపై పది కోట్లకు పరువునష్టం దావా వేస్తా. పవన్ కళ్యాణ్ తన నాయకులను అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు.
ఎవడో ఎక్కడో స్టేట్ మెంట్ ఇస్తే ఇక్కడ ఈనాడు దుర్మార్గపు రాతలు రాస్తోంది. మైత్రి మూవీస్‌లో పెట్టుబడి పెట్టిన తెలుగుదేశం ఎమ్మెల్యేని వదిలేసి నా మీద అబాండాలు వేస్తున్నారు. నేను ప్రజలలో తిరుగుతుంటే కడుపుమండి రోతలు రాస్తున్నారు' అని బాలినేని తెలిపారు.