విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ముడిపదార్థాలు, నిర్వహణ మూలధనం సమకూర్చడానికి ముందుకువచ్చిన సంస్థల ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) బిడ్ల పరిశీలన కోసం యాజమాన్యం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. మార్కెటింగ్, ఫైనాన్స్, మెటీరియల్స్ తదితర విభాగాలకు చెందిన నలుగురు సీజీఎం స్థాయి అధికారులను ఈ కమిటీలో నియమించారు. వీరు ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితి, పనితీరు ఆధారంగా జాబితాను రూపొందిస్తారు. ఆ తరువాత మే మొదటి వారంలో టెండరు కోసం ప్రకటన ఇస్తారు. దానికి మళ్లీ 21 రోజుల గడువు ఉంటుంది. ఈవోఐలో పాల్గొనలేకపోయినవారు కూడా టెండరులో పాల్గొనే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్టీల్ ప్లాంటు యాజమాన్యం తనకు ఎంత మెటీరియల్ కావాలి.
ఏ నాణ్యతలో కావాలి. నిర్వహణ మూలధనం ఎంత. ఎలా సమకూర్చాలి. తదితర వివరాలన్నీ టెండరులో పేర్కొంటుందని చెబుతున్నారు. కాగా, ఈవోఐని చూసిన తరువాత స్టీల్‌ప్లాంటుపై ఎవరి ఆసక్తి ఏమిటో తెలిసిందని కార్మిక సంఘ నాయకులు చెబుతున్నారు. విశాఖ స్టీల్‌కు నష్టం వాటిల్లకుండా, సంస్థ మార్కెటింగ్ నెట్‌వర్క్ దెబ్బతీయని సంస్థలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని, వీలైనంత వరకు ప్రభుత్వ సంస్థలకు ఇవ్వాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. ప్లాంటును ప్రైవేటీకరణ చేయకూడదనే పోరాటం కొనసాగిస్తున్నామని తెలిపారు. దీనికోసం ఈ నెల 26న స్టీల్‌ప్లాంటు సమీపాన భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభలో వామపక్షాల నాయకులు రామకృష్ణ, రాఘవులు తదితరులు పాల్గొంటారని తెలిపారు. మే 3వ తేదీన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ‘సేవ్ స్టీల్‌ప్లాంట్’ నినాదంతో రాస్తారోకోలు నిర్వహిస్తామని అయోధ్యరామ్ పేర్కొన్నారు.