మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన’ పథకం వివాదంలో చిక్కుకుంది. ఈ పథకంలో భాగంగా డిండౌరి జిల్లా గాడాసరయీ పట్టణంలో శనివారం 219 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పేర్లు నమోదు చేసుకున్నవారిలో ఐదుగురు అమ్మాయిలు గర్భవతులని పరీక్షల్లో తేలడంతో వారిని వివాహాలకు అనుమతించలేదు. దీంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందిస్తూ.. ఏ నిబంధన కింద ఆ యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని, ఇది పేదలను అవమానించడమేనని పేర్కొంది. గర్భనిర్ధారణ పరీక్షలకు ఎవరు ఆదేశించారని ప్రశ్నించింది.
సుమారు 200 మంది మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటిని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ ప్రస్తావిస్తూ.. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘ఈ వార్త నిజమో కాదో? ముఖ్యమంత్రిగారి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను? ఈ వార్త నిజమైతే, మధ్యప్రదేశ్ ఆడపడచులకు ఈ ఘోర అవమానం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? పేద, గిరిజన వర్గాల ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి దృష్టిలో పరువు లేదా? శివరాజ్ ప్రభుత్వంలో మధ్యప్రదేశ్ ఇప్పటికే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ, ఉన్నత స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను.. ఇది గర్భ పరీక్షకు సంబంధించిన విషయం మాత్రమే కాదు.. మొత్తం స్త్రీ జాతి పట్ల హానికరమైన వైఖరి కూడా’ అని తెలిపారు.
అయితే, ఈ విమర్శలను డిండౌరి కలెక్టర్ వికాశ్ మిశ్రా తోసిపుచ్చారు. సామూహిక వివాహా కార్యక్రమంలో పేర్లు నమోదుచేసుకునే యువతులకు సికిల్ సెల్ (రక్తహీనత) పరీక్షలు నిర్వహించాలని మార్గదర్శకాలు ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలో సికిల్ సెల్ పరీక్షలు నిర్వహిస్తుండగా కొందరు.. తమకు నెలసరి సంబంధిత సమస్యలు ఉన్నాయని తెలిపారని అన్నారు. దీంతో వారికి వైద్యులు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురు గర్భిణులని తేలిందన్నారు. ఈ కార్యక్రమంలో వివాహం చేసుకునే యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలనే నిబంధన ఏమీ లేదని వికాశ్ మిశ్రా స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో ‘ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన’లో పెళ్లి చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.56 వేల నగదు సహాయం అందిస్తోంది. ఈ పథకం 2006 నుంచి అమలవుతోంది.
గర్భ నిర్దారణ పరీక్షలో పాజిటివ్ వచ్చిన ఓ యువతి మాట్లాడుతూ.. పెళ్లికి ముందు నుంచే తనకు కాబోయే భర్తతో కలిసి ఉంటున్నానని తెలిపింది. ‘ప్రెగ్నెన్సీ పరీక్ష పాజిటివ్ వచ్చింది.. దీంతో వివాహ పథకం తుది జాబితాలో నా పేరు తొలగించారు.. అయితే, అధికారులు దీనిపై సరైన కారణం వెల్లడించలేదు’ అని వివరించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరీక్షలు నిర్వహించలేదని.. ఇప్పుడు ఇది ఆ అమ్మాయిలను అవమానించడమే’ అని బచ్చర్‌గావ్ గ్రామ సర్పంచ్ మేదాని మరావి అన్నారు.