హైకోర్టుకు దారితీసే సీడ్‌యాక్సెస్ రోడ్డు, ఇతర రహదారుల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తున్నామని సీఆర్డీఏ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. వీధి దీపాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. జూన్ చివరినాటికి పూర్తి చేస్తామన్నారు. వివరాలు కోర్టు ముందు ఉంచామన్నారు. కర్ణాటక ఎన్నికలకు ప్రత్యేక అధికారిగా వెళ్లిన నేపథ్యంలో సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ కోర్టు ముందు హాజరుకాలేకపోయారన్నారు. హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మెమో దాఖలు చేశామన్నారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న కోర్టు సోమవారం నాటి హాజరు నుంచి కమిషనర్‌కు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణకు హాజరు కావాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను జూన్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీ రమేశ్ సోమవారం ఆదేశాలిచ్చారు. ఏపీ హైకోర్టుకు వచ్చే రహదారుల్లో మౌలికసదుపాయాలు అభివృద్ధి చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఏ వేణుగోపాలరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సురక్షితమైన రహదారుల నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు, భద్రత చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గత ఏడాది సెప్టెంబర్‌లో విచారణ జరిపిన హైకోర్టు విద్యుత్ దీపాలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది. హైకోర్టుకు దారితీసే సీడ్‌యాక్సెస్ రోడ్డు, ఇతర రహదారుల్లో రెండునెలల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులు అమలుకాకపోవడంతో పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన కోర్టు కమిషనర్ హాజరుకు ఆదేశించింది. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకురాగా పిటిషనర్ తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు.