మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యోదంతంపై నాటి కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మను సీబీఐ విచారించింది. హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ఆరా తీసింది. సోమవారం హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి వెళ్లిన రాహుల్‌దేవ్‌ను గంటకుపైగా సీబీఐ ప్రశ్నించింది. అప్పట్లో తాను సేకరించిన ఆధారాలను ఆయన సీబీఐ అధికారులకు అందజేశారు. వివేకా హత్య గురించి తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన పులివెందులకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుండె పోటు ప్రచారం నుంచి గొడ్డలి పోటు వరకూ కేసు ప్రారంభ దశలో ఆయన సారథ్యంలోనే దర్యాప్తు జరిగింది. అప్పట్లో గమనించిన అంశాలు, సేకరించిన ఆధారాలు, లభించిన క్లూస్.. అనుమానితుల వివరాలు అన్నీ ఆయన్ను అడిగి సీబీఐ తెలుసుకుంది. అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సేకరించిన ఆధారాలతోపాటు బయటకు వెల్లడించని కొన్ని అనుమానాలను సైతం ఆయన వివరించినట్లు తెలిసింది. హత్య అనంతరం జరిగిన పరిణామాలు, ఆ రోజు వివేకా ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆధారాలేమిటి.. ఇంకా ఏమైనా అనుమానాస్పద అంశాలను గుర్తించారా అనే వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. కేసులో ఇతర ఆధారాలు, స్టేట్‌మెంట్ల రికార్డు, ఇప్పటికే తాము సేకరించిన వివరాలతో పాటు మరింత కీలక సమాచారాన్ని రాహుల్‌దేవ్‌ను అడిగి తెలుసుకున్నారు.