విజయనగరం జిల్లా, అదే ప్రాంతం లోని గాజులరేగ లో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై యువకుడు మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్ళితే..... గాజులరేగ ప్రాంతానికి చెందిన పాండ్రంకి యాకోబు, మిరియమ్మ దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు ఇజ్రాయిల్(22) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు ఆల్తి అఖిల్, గొడ్డు సురేష్‌లతో సోమవారం సాయంత్రం మైత్రీనగర్‌లోని గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాడు. వాన మొదలవ్వడంతో స్నేహితులతో షెల్టర్‌లోకి బయలుదేరాడు. అంతలోనే అకస్మాత్తుగా ఉరుములతో పాటు పెద్ద శబ్ధం చేస్తూ పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే ఇజ్రాయిల్, అఖిల్, సురేష్‌లు కూలిపోయారు. ఇజ్రాయిల్ క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. మిగతా ఇద్దరిని కేంద్రాస్పత్రికి తరలించారు. ఇజ్రాయిల్ తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని చదివిస్తున్నారు. ప్రయోజకుడు అవుతాడనుకుంటున్న సమయంలో పిడుగు పాటుకు గురై మృతిచెందటంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. వారి అర్తనాదాలు అక్కడి వారందరినీ కంటతడి పెట్టించాయి. ఈ ఘటనతో గాజులరేగకు చెందిన స్థానిక యువత అంతా కేంద్రాసుపత్రికి భారీగా చేరుకున్నారు.