రాజమండ్రికి చెందిన సుధీర్.. నగరంలోని జాంపేట నుంచి దానవాయి పేట గాంధీ పార్కుకి వెళ్లే రోడ్డు పక్కన పాప్ కార్న్ బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పాప్ కార్న్‌తోపాటు రకరకాల హాట్ స్నాక్స్‌ను అతడు అమ్ముతుంటాడు. రోడ్డు పక్కనే ఉండటం.. పదార్థాలు రుచిగా ఉండటంతోపాటు.. అతడు శ్రద్ధగా పని చేస్తుండటంతో.. ఆ బండిని ఉన్న ప్రాంతం ఎప్పుడూ కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. ఇతడికే బీటెక్ చదివిన తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు ఓ తండ్రి.
వాస్తవానికి సుధీర్ కూడా బీటెక్ ట్రిపుల్ ఈ చదివాడు. సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరో చెబితే అమాయకంగా నమ్మి రూ.10 లక్షలు కట్టాడు. అది కూడా బయట అప్పుతెచ్చి. కొంత కాలం తర్వాత తాను మోసపోయానని సుధీర్‌కు అర్థమైంది. అతడి ప్లేస్‌లో మరొకరు ఉంటే ఏం చేసేవారో..? కానీ సుధీర్ మాత్రం ధైర్యం కూడదీసుకున్నాడు. ఆ అప్పులు ఎలాగైనా తీర్చాలని ఆలోచించాడు. అలా మొదలైందే ఈ పాప్ కార్న్ బండి. 7-8 ఏళ్లుగా పాప్ కార్న్ బండి నడుపుతోన్న సుధీర్.. బయట తెచ్చిన అప్పుల్లో ఇప్పటి వరకూ సగం తీర్చేశాడు.
వ్యాపారం సాగుతోంది.. కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు.. వయసు కూడా పెరుగుతోంది. మరీ పెళ్లి సంగతేంటి..? బీటెక్ చదివి రోడ్డు పక్కన పాప్ కార్న్ అమ్ముకునే వాడికి ఎవరైనా పిల్లనిస్తారా..? కష్టమే కదూ..! కానీ ఆ విషయంలో సుధీర్ అదృష్టవంతుడు. బీటెక్ చదివిన అమ్మాయి అతణ్ని పెళ్లి చేసుకుంది. ఆమె చాలా గ్రేట్ అనుకుంటున్నారు కదూ. ఆమె కంటే ఆమె తండ్రి ఇంకా గ్రేట్. ఎందుకంటే ఆయనే తన కూతుర్ని ఈ పెళ్లికి ఒప్పించాడు. ‘ఉద్యోగం చేసుకునే వాడి కన్నా రోజంతా కష్టపడి పని చేసుకునేవాడు నిన్ను కళ్లలో పెట్టుకొని చూసుకుంటాడు తల్లీ.. అతడితో నీ జీవితం బాగుంటుందమ్మా’ అని చెప్పిన మాటలు ఆమెను సుధీర్‌తో కలిసి ఏడడుగులు వేయడానికి ఒప్పించాయి. సుధీర్ మామ గారు కూడా డిగ్రీ చదివారట. కొంత ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇక లాభం లేకపోవడంతో ఆటో నడపటం మొదలుపెట్టారు.
అందరిలాగే సాఫ్ట్ వేర్ జాబ్ చేద్దామని కలలుగన్న సుధీర్.. చివరకు పాప్ కార్న్ బండి నడుపుతూ తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. తను చేసే పని విషయంలో ఎప్పుడూ నామోషీగా ఫీలవడు. అంతే కాదు తన తమ్ముడికి కూడా రాజమండ్రిలోనే మరో ప్రాంతంలో పాప్ కార్న్ బండి పెట్టించాడు. అందరూ కలిసి ఉన్నదాంట్లోనే సంతృప్తిగా జీవితాన్ని గడుపుతున్నారు. తన అప్పులు తీరిపోయాక వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే ఆలోచనలో ఉన్నాడు సుధీర్.
నచ్చిన ఉద్యోగం వస్తేనే చేస్తామంటూ ఏళ్లకు ఏళ్లు వృథా చేసే వాళ్లు మన మధ్యలోనే ఎంతో మంది. అయితే ఐటీ లేదంటే గవర్నమెంట్ జాబ్ అయితేనే చేస్తామని చాలా మంది కాలయాపన చేస్తుంటారు. చివరకు ఉద్యోగం రాకపోతే.. జీవితంలో అడ్జస్ట్ కాలేక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు. సుధీర్ అనుకున్న ఉద్యోగాన్ని పొందలేకపోవచ్చు.. కానీ ఆ ఉద్యోగం లేకపోయిన సరే తన కాళ్ల మీద తాను నిలబడగలని నిరూపించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa