ఏపీలో ఇంటింటికి రేషన్ పంపిణీ కోసం జగన్ సర్కార్ ఎండీయూ వాహనాలను తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా ఈ వాహనాల ద్వారా రేషన్‌ను పంపిణీ చేస్తున్నారు. అయితే ఇలా ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాన్ని తాకట్టు పెట్టాడో డ్రైవర్. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లి సచివాలయం పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంరేపగా.. ఈ ఘటనతో అధికారులు కూడా అవాక్కయ్యారు.
రాచపల్లి సచివాలయ పరిధిలో అదే గ్రామానికి చెందిన రాయవరపు నాగరాజు ఎండీయూ వాహనం ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తుంటారు. ప్రతి నెలా ఒకటి నుంచి 15 వరకు పంపిణీ కొనసాగుతుండగా.. రెండు రోజుల నుంచి నాగరాజు కనిపించడం లేదు. అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నాగరాజు ఆచూకీపై ఆరా తీశారు. ఈ క్రమంలో అసలు ట్విస్ట్ బయటపడింది.
రామన్నపాలెంకు చెందిన ఒక వ్యక్తికి మూడు వారాల కిందట ఎండీయూ వాహనాన్ని తాకట్టు పెట్టినట్లు తేలింది. రూ.40 వేలకు తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి దగ్గర రెండు రోజుల క్రితం బైక్ తీసుకున్నాడు. బైక్ కూడా తీసుకెళ్లి తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. రేషన్ వాహనాన్ని తాకట్టు పెట్టినట్లు అధికారులకు సమాచారం వెళ్లింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏకంగా రేషన్ వాహనం తాకట్టు వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం, ఇతర సరుకులను కార్డుదారుని ఇంటికే అందించేందుకు ప్రభుత్వం మినీ ట్రక్కులు అందజేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం 9,260 మినీ ట్రక్కుల తయారీకి మారుతి సుజుకి, టాటా కంపెనీలకు సర్కారు అనుమతిచ్చింది. ఇక, జనవరి నుంచి సరుకుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ వాహనాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డోర్ డెలివరీ కోసం మొబైల్ వాహనాలను సమకూర్చిన సంగతి తెలిసిందే. ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఈబీ కార్పొరేషన్‌ల ద్వారా వాహనాలను అందజేశారు. ఈ ఒక్కో వాహనం ధర రూ.5,81,000.. అందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.3,48,600 కాగా.. బ్యాంక్ లింకేజీ ద్వారా మరో రూ.1,74,357.. లబ్ధిదారుని వాటా కేవలం రూ.58 వేలు మాత్రమే. పౌర సరఫరాల శాఖ ప్రతి నెలా అద్దె చెల్లించేలా చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఒక్కొక్క వాహనదారుడికి ప్రతి నెలా అద్దెను రూ.16వేల నుంచి రూ.21 వేలకు పెంచింది. అద్దె కింద రూ.13 వేలు, వాహనదారుడి సహాయకుడికి చెల్లించే హెల్పర్ చార్జీలను రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ కోసం రూ.3 వేలు చెల్లిస్తారు.