కునో జాతీయ పార్కులో చీతా ఉదయ్ కార్డియో పల్మనరీ వైఫల్యంతో మృతికి చెందినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఉదయ్ సహా 12 చీతాలను ఈ ఏడాది ఫిబ్రవరి 17న దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భారత్‌కు వచ్చే సమయంలో ఆరోగ్యంగా ఉన్న చీతా ఉదయ్.. ఆదివారం అస్వస్థతకు గురై చనిపోయింది. చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఉదయ్ నడవడానికి ఇబ్బంది పడిందని అధికారులు తెలిపారు.
‘‘మగ చీతా ఉదయ్‌కు పోస్ట్‌మార్టం నిర్వహించిన జంతువైద్య నిపుణులు... కార్డియో పల్మనరీ వైఫల్యంతో చనిపోయినట్టు ప్రాథమిక పరిశీలనలో నిర్దారణకు వచ్చారు’’ అని మధ్యప్రదేశ్ వైల్డ్‌లైఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహన్ వెల్లడించారు. చీతా మృతిపై ఐదుగురు నిపుణుల కమిటీని నియమించారు. ఉదయ్ నుంచి రక్త, ఇతర నమూనాలను సేకరించి పరీక్షల కోసం జబల్‌పూర్‌లోని నానాజీ దేశ్‌ముఖ్ వెటర్నరీ సైన్స్ యూనివర్సిటీ వైల్డ్‌లైఫ్ ఫోరెన్సిక్ అండ్ హెల్త్ స్కూల్‌కు పంపారు.
అధునాతన పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే చిరుత మృతికి గల అసలు కారణం తెలియనుంది. ఉదయ్ తన ఎన్‌క్లోజర్‌లో నిదానంగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. నిశితంగా పరిశీలించడంతో అస్వస్థతో ఉన్నట్లు తేలిందని అధికారిక ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం వరకూ ఆరోగ్యంగా ఉన్న చిరుత.. ఆదివారం ఉదయానికి అనారోగ్యానికి గురైనట్టు వైద్య నిపుణులు గుర్తించారు. దీంతో ఉదయం 11 గంటలకు చికిత్స ప్రారంభించగా.. సాయంత్రం 4 గంటలకు చనిపోయింది.
దీనికి ముందు సాషా అనే చీతా మార్చి 27న చనిపోయిన విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో సాషా చనిపోయింది. నమీబియాలోనే ఈ చీతా అనారోగ్యానికి గురైనట్టు అధికారులు తెలిపారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 20 చీతాలను తీసుకురాగా.. ఇందులో రెండు చనిపోయారు. దీంతో కునోలో ప్రస్తుతం 18 మాత్రమే ఉన్నాయి.