తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశిస్తూ కాకినాడ జిల్లా వినియోదారుల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. అయితే పరిహారం సొమ్ములో 50శాతాన్ని కాకినాడ వినియోగదారుల కమిషన్ వద్ద జమ చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీకి స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రతివాదులుగా ఉన్న కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర వ్యవసాయ మరియు సహకారశాఖ ముఖ్యకార్యదర్శి, వ్యవసాయశాఖ కమిషనర్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సీఈవో, కాకినాడ డీసీసీబీకి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు రూ.16.46 కోట్ల పరిహారం చెల్లించాలని ఈ ఏడాది జనవరి 28న కాకినాడ జిల్లా వినియోగదారుల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన పథకం నిబంధనల ప్రకారం రైతులకు సంబంధించిన బీమా ప్రీమీయం సొమ్మును చెల్లించాల్సిన బాధ్యత స్థానిక కాకినాడ డీసీసీబీదేనని అన్నారు. రైతులకు రుణాలు మంజూరు చేసే సమయంలోనే బ్యాంక్ అధికారులు వారి నుంచి బీమా ప్రీమియం సొమ్ము మినహాయిస్తారన్నారు.