పదో తరగతి పరీక్షల్లో వచ్చే ఏడాది నుంచి భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులకు వేర్వేరు ప్రశ్నపత్రాలను ఇవ్వడంతోపాటు, ఈ రెండు పరీక్ష లకు అరగంట సమయం వ్యవధి ఉండేలా మార్పులు చేయాలని యోచిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఏలూరులోని సెయింట్ గ్జేవియర్ హైస్కూలులో పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని ఆయన సందర్శించి స్పాట్ జరుగుతున్న తీరు, సిబ్బందికి సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు. మూల్యాంకన సిబ్బందికి వెసులుబాటు ఉండేలా వచ్చే విద్యాసంవత్సరం నుంచి జిల్లాలో రెండు చోట్ల స్పాట్ కేంద్రాలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఒకే ప్రశ్నపత్రంతో ఫిజిక్స్, బయోలాజికల్ సైన్సు పరీక్షలను నిర్వహించడం వల్ల ఈ ఏడాది కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తినట్టు గుర్తించామన్నారు. సోషల్ సబ్జెక్టు పరీక్షకు మ్యాప్‌ను ప్రశ్నపత్రంతోపాటే ఇస్తున్నట్టుగా గణితం పరీక్షకు కూడా గ్రాఫ్ షీట్‌ను ముందుగానే వచ్చే ఏడాది నుంచి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. పది పరీక్షల స్పాట్ వాల్యూయేషన్ బుధవారంతో ముగుస్తుందని, పెం చిన రెమ్యునరేషన్ రేట్ల ప్రకారమే చెల్లింపులు ఉంటాయని వివరించారు. డీఈవో రవిసాగర్, పరీక్షల సహాయ కమిష నర్ శ్రీకాంత్, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు ఉన్నారు. డీజీని డెమొక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు కలసి పుష్పగుచ్ఛాలను అందించారు.