కర్నూలు జిల్లా, ఆస్పరి మండల పరిధిలోని కారుమంచి గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. కారుమంచి గ్రామానికి చెందిన బోయ హనుమంతు (60)మంగళవారం హత్యకు గురయ్యాడు. ఎస్ఐ వరప్రసాద్ వివరాల ప్రకారం.. బోయ హనుమంతు 2008లో బోయ చెన్నప్ప హత్య కేసులో, 2010లో బోయ చిన్న పోతన్న హత్య కేసులోనిందితుడిగా ఉన్నాడు. నాటి నుంచి నేటి వరకు దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. తన కుటుంబ సభ్యులతో బైలు పత్తికొండ గ్రామంలోని సుంకలమ్మ అవ్వ దేవరకు హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా కల్లపరి గ్రామ సమీపంలో ప్రత్యర్థులు కాపుకాచి హత్య చేశారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.