వివేకాహత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి అరెస్టు తప్పదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి అన్నారు. ఆయన అరెస్టుతోనే ఇది ఆగదని, విస్తృత కుట్రలో ఉన్న పెద్దపెద్ద వ్యక్తులను సీబీఐ కచ్చితంగా అరెస్టుచేసి తీరుతుందని చెప్పారు. మంగళవారమిక్కడి ఏపీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అవినాశ్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు వాదించినా టీ.హైకోర్టు తీర్పు తప్పంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ హత్యపై సీబీఐ విచారణను మేమే కోరాం. 2019లో జగన్ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సీబీఐ అన్నారు. అధికారంలోకి వచ్చాక సీబీఐ వద్దు.. సిట్-2 అన్నారు. 2019 డిసెంబరు 12న కడపలో నన్ను 2గంటలు విచారించారు. ప్రశ్నలు ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాం తప్ప.. మీరు ముద్దాయని మేం చెప్పడంలేదని దర్యాప్తు అధికారులు నాతో అన్నారు. సీబీఐకి అప్పగించాక.. కుక్కలను ఎవరు చంపారు.. ఎలా జరిగింది.. గొడ్డలి ఎక్కడ కొన్నారు.. ఇంటి చుట్టూ కెమికల్ చల్లడం.. అన్నీ బయటకు వచ్చాయి. అవినాశ్‌రెడ్డి ఇంట్లోకి వచ్చి రక్తపు మరకలను కడిగించేటప్పుడు సీఐ శంకరయ్య అభ్యంతరం చెప్పాడు. మా ఇంట్లో విషయం.. నోరుమూసుకోమని అవినాశ్‌రెడ్డి చెప్పారు. వాళ్లే కుట్లు వేసి.. వాళ్లే కట్లుకట్టి వాళ్లే కట్టుకథలు చెప్పారు. నాటి నుంచి నేటివరకు కట్టుకథలు అల్లుతూనే ఉన్నారు అని తెలియజేసారు.