అనంతపురం జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ మంత్రి టీడీపీలో వస్తారంటూ సరికొత్త ప్రచారం మొదలైంది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది. జేసీ దివాకర్ రెడ్డి దాదాపు గంటపాటు శైలజానాథ్‌తో చర్చలు జరిపారు. శైలజానాథ్ ఆహ్వానం మేరకే జేసీ ఆయన నివాసానికి వెళ్లారని చెబుతున్నారు. శైలజానాథ్ టీడీపీలోకి వస్తారని స్థానికంగా చర్చ జరుగుతోంది. జేసీ, శైలజానాథ్‌లు మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
సాకే శైలజానాథ్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రాథమిక విద్యాశాఖ, పాఠ్యపుస్తకాలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. శైలజానాథ్ 2022 జనవరి నుంచి 2022 నవంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. జేసీ దివాకర్ రెడ్డి, సాకే శైలజానాథ్‌లు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 2014 ఎన్నికల సమయంలో జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరగా.. శైలజానాథ్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే మాజీ మంత్రి రఘువీరా రెడ్డి కూడా మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. ఇప్పటికే కర్ణాటక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుందామని భావించానని.. కానీ తాజా పరిణామాలతో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చెప్పారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవడం భావ్యమా అని ఆలోచించినట్లు చెప్పారు. అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రఘువీరారెడ్డి కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మడకశిర నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది.. దీంతో ఆయన నియోజకవర్గం మారారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో రఘువీరారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసి కొణిజేటి రోశయ్య ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ మంత్రిగా పనిచేశారు. విభజన తర్వాత ఏపీకి పీసీసీ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఇటీవలే రాయలసీమ నేతలంతా సమావేశమయ్యారు.. అక్కడ కూడా జేసీ, శైలజానాథ్ మాట్లాడుకుంటూ కనిపించారు. అంతేకాదు రాయలసీమను తెలంగాణ పేరుతో జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని.. అప్పుడే రాయలసీమ సాగునీటి సమస్య తీరుతుందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాయలసీమ వచ్చినా సంతోషమేనని.. అలాగే రాయల తెలంగాణ అయినా ఫర్వాలేదన్నారు. ఈ రాయల తెలంగాణ నినాదానికి తనవంతుగా మద్దతు కూడగడతానని కామెంట్ చేశారు. తెలంగాణలో రాయలసీమను కలుపుకోవాల్సిన అవసరం సీఎం కేసీఆర్‌కు ఉందన్నారు.