ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు బయలుదేరి వెళ్లే సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణాలు ఆలస్యం కావడమో లేక రద్దు కావడమే జరిగాయి. తాజాగా, బుధవారం మరోసారి అనంతపురం జిల్లాలోని నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొని పుట్టపర్తికి బయల్దేరే సమయంలో మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో అనంతపురం జిల్లా శింగనమలలోని నార్పలలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘వసతి దీవెన’ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్.. అక్కడి నుంచి పుట్టపర్తికి వెళ్లాల్సి ఉంది. దీంతో అధికారులు కూడా హెలికాఫ్టర్‌ను సిద్ధం చేశారు. కానీ, సాంకేతిక లోపం ఏర్పడినట్లు చివరి నిమిషంలో గుర్తించారు. దీంతో సీఎం జగన్ హెలికాఫ్టర్ ప్రయాణాన్ని రద్దు చేసుకుని, రోడ్డు మార్గం ద్వారా పుట్టపర్తికి వెళ్లారు.
ఇదిలాీవుంటే గతంలోనూ పలుమార్లు సీఎం జగన్ ప్రయాణించే హెలికాఫ్టర్ మొరాయించింది. దీంతో సీఎం జగన్ ప్రయాణాల్లో మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. గతంలో ఓసారి సీఎం జగన్ హెలికాఫ్టర్ గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికి సాంకేతిక లోపం తలెత్తడంతో కిందకు దించేశారు. దీనిపై అప్పట్లో విచారణ కమిటీ కూడా వేశారు. ఆ తర్వాత కూడా సీఎం జగన్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తగా.. ప్రత్యమ్నాయ మార్గాలు చూశారు. అయినా కూడా మళ్లీ మళ్లీ ఇదే సమస్య తలెత్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. సీఎం జగన్ భద్రతను అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం స్థాయి వ్యక్తి ప్రయాణించే చాపర్ల విషయంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇదిలావుంటే గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఏపీ ప్రభుత్వ హెలికాఫ్టర్‌లోనే ‘రచ్చబండ’ కార్యక్రమానికి బయల్దేరి మార్గమధ్యంలో కూలిపోయి చనిపోయారు. ఆ ఘటన తర్వాత కూడా ముఖ్యమంత్రి అధికారిక పర్యటనలు చేసే సమయంలో భద్రతను పర్యవేక్షించడంలో అధికారుల్లో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. వీఐపీలు ప్రయాణించే హెలికాఫ్టర్లను ప్రయాణాలకు సిద్ధం చేసే విషయంలో ఎస్వోపీ ఉంటుంది. అలాగే ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. కానీ, సీఎం జగన్ పర్యటించే హెలికాఫ్టర్‌లో మాత్రం ఈ రెండు నెలల్లో మూడోసారి సాంకేతిక లోపం తలెత్తడం వైసీపీ శ్రేణులు, అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది.