తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన నిరసనను విరమించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తీరును నిరసిస్తూ గత నాలుగు రోజులుగా మున్సిపల్ కార్యాలయం వేదికగా జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన తెలియజేశారు. శిబిరం వద్దకు కలెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా విధుల పట్ల నిర్లక్ష్య వైఖరిపై వంటా వార్పుతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జేసీ నిరసన దీక్షా శిబిరం వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అయితే గత నాలుగు రోజులుగా నిరసన తెలియజేస్తున్నప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో జేసీ శాంతియుతంగా దీక్షను విరమించారు. కాసేపటి క్రితం మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్, గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి ఆపై జేసీ దీక్షను విరమించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వెంట తాడిపత్రి ఇన్‌చార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి, టీడీపీ నేతలు కౌన్సిలర్లు ఉన్నారు.