రాష్ట్రంలో గతంలో బలహీనంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు, ప్రైమరీ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ సొసైటీలకు సంబంధించి సీఎం జగన్మోహన్‌రెడ్డి మంజూరు చేసిన రూ.295కోట్లతో 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, ఆప్కాబ్ కూడా లాభాల బాటలో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖామంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెంలోని వవ్వేరు బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వవ్వేరు కోఆపరేటివ్ రూరల్ బ్యాంకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2వ స్థానంలో ఉండగా.. నూతన ఆంధ్ర రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. బుచ్చి, వవ్వేరు బ్యాంకులు రెండూ రైతాంగానికి అన్ని సేవలందిస్తుండడం ఆనందదాయకమన్నారు.కో-ఆపరేటివ్ రంగంలో రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించి వాణిజ్య, ఉద్యాన పంటలకు అండదండగా నిలిచేందుకు ప్రధాన ఆర్థిక వనరులు కో ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా అందించే వెసులుబాటుందన్నారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆలోచన మేరకు, వవ్వేరు బ్యాంకుకు ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారం అందించి రైతులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి బి.సుధాభారతి, బ్యాంకు మేనేజర్లు శ్రీనివాసులు, సురేష్‌రెడ్డి, వవ్వేరు బ్యాంకు చైర్మన్ ఎర్రంరెడ్డి స్వర్ణమ్మ, భర్త గోవర్ధన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, వైసీపీ నాయకులు మోర్ల మురళి, డాక్టర్ అల్లాబక్షు, చీర్ల ప్రసాద్, మోహన్, కార్యకర్తలు పాల్గొన్నారు.