రాష్ట్రంలో అనేక జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంనకు చెందిన వనపర్తి రాజు ప్రస్తుతం అద్దంకి మండలం ధేనువకొండలో నివాసం ఉంటూ పొన్నలూరు మండలం తేటుపేటకు చెందిన మరో నలుగురుతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఎనిమిది దొంగతనాలు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో గల గెలాక్సీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మలికగర్గ్ దొం గల ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధేనువ కొండలో ఉంటున్న వనపర్తి రాజు అలియాస్ శివ, కొమరిగిరి పేరయ్య, పొన్నలూరు మండలం తేటి పేటకు చెందిన చలంచర్ల మల్లిఖార్జున, చలంచర్ల ఆంజనేయులు, చెలంచర్ల చెంచయ్య ముఠాగా ఏర్పడి చోరీలు చేయడం ప్రారంభించారు. ఈక్రమంలో గత నెల 8న తాళ్లూరులో జరిగిన దొంగతనం గురించి దర్యాప్తు చేస్తుండగా ఈ ఐదుగురు అనుమానాస్పదంగా తాళ్లూరు మండలం శివరామపురం ఎన్నెస్పీ కెనాల్ వద్ద తిరుగుతుండగా దర్శి సీఐ జె.రామకోటయ్య ఆధ్యరంలో ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. వారిని విచారించగా అనేక దొంగతనాలు చేసినట్లు అంగీకరించారని ఎస్పీ చెప్పారు. వారి వద్ద నుంచి రూ.40లక్షలు విలువ చేసే 742 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 3.50లక్షలు విలువ చేసే 5 కిలోల వెండి ఆభరణాలు మొత్తం రూ43.50 లక్షలు సొత్తును స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇంకా నిందితులు చోరీలు చేసేందుకు వినియోగించే కారు, డ్రిల్లింగ్‌మిష న్లు, గడ్డపార, స్కూృడైవర్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. వారిపై తాళ్లూరులో 3, ముండ్లమూరులో 2, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 1, కొరిశపాడులో 1, నెల్లూరు జిల్లా కందుకూరు రూరల్ పరిధిలో 1 దొంగతనం కేసులు నమోదైౖనట్లు ఎస్పీ వెల్లడించారు.