మాతా శిశుమరణాల నివారణే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని పార్వతీపురం డీఎంహెచ్‌వో బి.జగన్నాథరావు సూచించారు. ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ సూపర్‌వైజర్లు, సీడీపీవోలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలన్నారు. ప్రసవం అయ్యే వరకూ వైద్య పరీక్షలు, ఆరోగ్య తనిఖీలు సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. గర్భిణులను త్వరితగతిన గుర్తించి నమోదు చేయాలని, అందుకు అవసరమైన పరీక్షల కిట్లు అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది వద్ద అందుబాటులో ఉండాలని ఆదేశించారు. హైరిస్క్ కేసులను త్వరగా గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోజూ ఐరెన్ మాత్రలు సమయానికి వెసుకునేలా చూడాలని, రక్తహీనత సమస్య లేకుండా చూడాలని సూచించారు. ఎప్పటికప్పుడు మాతా శిశు సంరక్షణ కార్డులో ఆయా వివరాలు నమోదు చేయాలన్నారు. గిరి శిఖర గ్రామాలు, రవాణా సదుపాయం లేని ప్రాంతాల్లో గర్భిణులను ప్రసవానికి ముందే సంబంధిత రిఫరల్ ఆసుపత్రి, వసతి కేంద్రాలకు చేర్చాలన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.విజయగౌరి , జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి టి.జగన్మోహన్‌రావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో జి.వి.రమణ, ప్రోగ్రాం అధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు.