విశాఖపట్నం నగరానికి మంచినీటిని సరఫరా చేసేందుకు రూపొందించిన ప్రాజెక్టుకయ్యే రూ.7,214 కోట్లను పోలవరం ప్రాజెక్టు వ్యయం నుంచి కేంద్రం తొలగించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ అమలాపురానికి చెందిన న్యాయవాది రమేశ్‌చంద్ర వర్మ హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది మంగిన శ్రీరామారావు వాదనలు వినిపించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఇరిగేషన్ ప్రాజెక్టులో అంతర్భాగంగా మంచినీటి సరఫరా ప్రాజెక్టు చేపట్టాలని ఎలా ఆదేశాలు ఇవ్వగలమని ప్రశ్నించింది. పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీల అమలుకు ఆదేశాలు ఇవ్వలేమంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.