గత నెల 28వ తేదీన విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి సభలో రజనీకాంత్ ప్రసంగిస్తూ చంద్రబాబును ప్రశంసించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నేతలు రజనీకాంత్‌పై తీవ్రంగా విరుచుకుపడి దుర్భాషలాడడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక తమిళనాడులోనూ కలకలం రేపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రజనీకాంత్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ‘దివంగత ఎన్టీఆర్‌తో మీకున్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని మిమ్మల్ని ఆహ్వానించాం. మీరు ఆయన గురించి మాట్లాడిన మాటలు తెలుగువారి హృదయం ఉప్పొంగేలా చేశాయి. కొంత మంది సంకుచితంగా రాజకీయ కోణంలో అనాగరికంగా మాట్లాడారు. రాజకీయాల్లో మేం ఇటువంటి మాటలకు అలవాటు పడిపోయాం. మీకు మాత్రం ఇబ్బంది కలిగించి ఉంటాయి’ అని విచారం వ్యక్తం చేశారు. అయితే తానేమీ పట్టించుకోలేదని.. ఇబ్బందిగా భావించడం లేదని రజనీకాంత్ అన్నారు. ‘ఎవరు ఏమనుకున్నారన్నది నాకు అనవసరం. నా మనసులో ఏముందో.. నేను ఏమనుకున్నానో అదే చెప్పాను. దానిపై ఎవరు ఎలా ప్రతిస్పందిస్తారన్నది నాకు అనవసరం. తమిళనాడులో కూడా రాగ ద్వేషాలు ఉంటాయి. ఇవన్నీ నేను అనుభవించినవాడినే. నా అభిమాన సంఘాల నాయకులు ఈ విమర్శలపై స్పందించాలని భావిస్తే.. వద్దని నేనే ఆపాను. రెండు చేతులు కలిస్తే ధ్వని పెరుగుతుంది. ఒక్క చేతితో ధ్వని రాదు. నాలుగు రోజులు సంయమనంతో ఉంటే అందరూ అన్నీ మరచిపోతారు’ అని ఆయన అన్నట్లు సమాచారం.