ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలకు జరిగిన పంట నష్ట గణనను ఈ-క్రాప్ ఆధారంగా చేపట్టాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లాల వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పీఎం కిసాన్-2023లో 14వ విడత లబ్ధికి రైతులందరూ ఈనెల 20లోగా ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకుని, బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ అనుసంధానంతో పాటు ఎన్‌పీసీఐ లింకేజ్ కూడా చేయించుకోవాలని సూచించారు. 2023 ఖరీఫ్ ఈ-క్రాప్ నమోదును జియో రిఫరెన్సింగ్ ద్వారా చేయబోతున్నట్లు చెప్పారు. క్లస్టర్ యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటు మే 12వరకు పూర్తి చేసి, రాయితీ ప్రతిపాదనలు ఈ నెల19లోగా పంపాలని సూచించారు. వైఎస్సార్ యాప్ ద్వారా యంత్ర పరికరాలను అద్దెకు తీసుకునే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ‘పచ్చిరొట్ట విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయనున్నాం. అన్ని రకాల కంపెనీల పత్తి, మిర్చి విత్తనాలు లభ్యమవుతాయి. అధిక ధరకు ఎవరూ కొనవద్దు. డీలర్లు కృత్రిమ నిల్వలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన హెచ్చరించారు.