విశాఖపట్టణం జిల్లా, ఎస్.రాయవరం మండలంలోని రేవుపోలవరం సముద్రతీరం వద్ద మంగళవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే... నర్సీపట్నం మండలం గురందొరపాలెం గ్రామానికి చెందిన కొల్లాన సత్తిబాబు, పద్మ దంపతుల కుమారుడైన కొల్లాన జగదీశ్(18) మాకవరపాలెం మండలంలోని అవంతీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం అదే గ్రామానికి చెందిన స్నేహితుడు బొట్టా గణేశ్ జన్మదినం కావడంతో మిత్రులందరూ కలిసి ఉత్సాహంగా వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. జగదీశ్‌తోపాటు మరో ఆరుగురు స్నేహితులు రేవుపోలవరం సముద్రతీరం వద్దకు వచ్చారు. ముందుగా కేక్ కట్‌చేసి వేడుకులు జరుపుకున్నారు. మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో జగదీశ్‌తోపాటు మరికొందరు సముద్రంలోకి దిగి సరదాగా గడుపుతున్నారు. ఈ సమయంలో అలల ఉధృతి పెరగడంతో జగదీశ్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియపరిచారు. ఎస్‌ఐ ప్రసాదరావు, మెరైన ఎస్‌ఐ రమణ సముద్రతీరం వద్దకు చేరుకొని పరిశీలించారు. జగదీశ్ స్నేహితులతో మాట్లాడి, ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా జగదీశ్ సముద్రంలో గల్లంతైన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా రేవుపోలవరం చేరుకున్నారు. కుమారుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లి పద్మ బోరున విలపించారు. కాగా జగదీశ్ మృతదేహం సాయంత్రానికి రేవుపోలవరం సమీపంలో లభ్యమైనట్టు హెచ్‌సీ భూలోక తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.