భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖలో అదానీ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేయడానికి సీఎం జగన్ బుధవారం విశాఖకు వస్తున్నారు. అయితే ఆ రెండూ చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులేనని, వైసీపీ వచ్చాక విశాఖలో ఒక్క ఐటీ పరిశ్రమ రాలేదని, ఉన్నవే చాలా వెళ్లిపోయాయని టీడీపీ నేతలు కొద్దిరోజులుగా విమర్శిస్తున్నారు. కనీసం వైసీపీ ప్రభుత్వం ఆయా కంపెనీలు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాయో తెలుసుకోలేదని, వారిని ఆపడానికి యత్నించలేదని ఆరోపిస్తున్నారు. ఇక్కడి పారిశ్రామికవేత్తలతో సీఎం ఒక్కరోజు మాట్లాడలేదని విమర్శించారు. ఇదే భావన విశాఖ పారిశ్రామికవేత్తలలోను ఉంది. ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం జరిగినప్పుడు పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా విజయసాయిరెడ్డి ఒకసారి, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ప్రస్తుత ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి ఒకసారి విశాఖ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి మాట్లాడారు. ఆ తరువాత వారి సమస్యలు వినలేదు. పరిష్కారం చూపలేదు. ఇప్పుడు నేరుగా సీఎంతోనే ముఖాముఖి ఏర్పాటుచేశారు. దీనికి కూడా ఎంపిక చేసిన పారిశ్రామికవేత్తలను మాత్రమే ఆహ్వానించారు. ఏపీఐఐసీ ద్వారా కొందరిని, ఐటీ అసోసియేషన్ ద్వారా కొందరిని, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున మరికొందరిని ఆహ్వానించారు. అయితే వచ్చేవారు ఎవరూ సమస్యలు ప్రస్తావించకూడదని, ప్రభుత్వంపై విమర్శలు చేయకూడదని, సీఎం అడిగితే సానుకూల శైలిలో సూచనలు మాత్రమే చేయాలని వారికి సూచించారు.